by Suryaa Desk | Thu, Jan 09, 2025, 06:49 PM
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ పై విచారణను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. విచారణ సందర్భంగా, కేటీఆర్ ను ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ ప్రశ్నించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వెల్లడించారు. ఏసీబీ అధికారులకు విచారణలో సహకరించానని తెలిపారు. ఇది ఒక చెత్త కేసు అని, రాజకీయ కక్షపూరిత కేసు అని విచారణ అధికారులకు చెప్పానని వెల్లడించారు. ఇటువంటి అసంబద్ధమైన కేసులో ఎందుకు విచారణ జరుపుతున్నారని అడిగానని కేటీఆర్ వివరించారు. ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలేమీ అడగలేదని, వారడిగిన ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు జవాబులు ఇచ్చాను అని తెలిపారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని చెప్పానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కేటీఆర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.