by Suryaa Desk | Fri, Jan 10, 2025, 12:13 PM
జలమండలికి కొత్తగా 141 మంది జూనియర్ అసిస్టెంట్స్ (పీ అండ్ ఏ, ఎఫ్ అండ్ ఏ) వచ్చారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షల్లో ఉద్యోగం సాధించిన వీరిని ప్రభుత్వం జలమండలికి కేటాయించింది. నేటి నుంచి రెండు రోజుల పాటు వీరికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని ఈస్కి క్యాంపస్ లో జరుగుతున్న ఈ శిక్షణ తరగతుల్ని ఎండీ అశోక్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. 1.3 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరానికి జలమండలి తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ సేవలు అందిస్తోంది. ఇలాంటి మహత్తరమైన సంస్థలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావించాలన్నారు. ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జలమండలిలో చేరబోతున్న మీరంతా.. ప్రజలకు సేవలందించడమే పరమావధిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఎలాగైతే కష్టపడ్డారో.. అలాగే నిజాయతీగా కష్టపడి జలమండలికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా గ్రూప్-4 లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి.. పెద్దపల్లిలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ఈస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు, సీజీఎంలు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రభు, పద్మజ తదిరులు పాల్గొన్నారు