by Suryaa Desk | Fri, Jan 10, 2025, 03:46 PM
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ప్రైమరీ విద్యార్థులు సంక్రాంతి పండగను పురస్కరించుకుని ముందస్తు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ - రజనీ దేవి దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ... అంతరించిపోతున్న మన తెలుగు పండగలు, వాటికి సంబంధించిన సంప్రదాయాలు నేటి తరం పిల్లలకు కూడా తెలియపరచి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు.
అందుకనే మా పాఠశాలలో సందర్భానుసారం ప్రతీ పండగ ను నిర్వహిస్తూ, వాటి యొక్క విశిష్టతను, వాటిని నిర్వహించుకునే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ, వారిలో మన సంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరచే క్రమంలో ఈ రోజు ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించినట్లు తెలిపి, భోగి పండగ, సంక్రాంతి, కనుమ పండగల విశిష్టతను చక్కగా వివరించి, అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు మరియు హరిదాసు, గోదాదేవి, గంగిరెద్దుల వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన భోగి మంటల చుట్టూ విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయినీల బృందం పాటలకు అనుగుణంగా నృత్యం చేయడం అందరినీ ఆకర్షించింది. కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ కూడా పిల్లలలో కలిసి నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.