by Suryaa Desk | Fri, Jan 10, 2025, 02:08 PM
సంక్రాంతి సీజన్ అంటే.. అందరికీ పండగే. సామాన్యులకు భక్తి.. వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్ సీజన్ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.ఇందుకోసం ప్రజలు ఎలాగైనా గమ్యం చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. బస్సుల్లోనో.. రైళ్లలోనో.. ఫ్లైట్స్ బుక్ చేసుకునో.. క్యాబ్‌లు మాట్లాడుకోనో.. వెళ్తుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు, ట్రావెల్స్ ఏజన్సీలు పండగ బాదుడుకి తెరతీశాయి. టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నాయి. సాధారంగా వెయ్యిరూపాయలు ఉండే టికెట్ ధర రెండింతలు పెంచేసేశారు ట్రావెల్స్ బస్సుల వ్యాపారులు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే వెయ్యి లోపే ఖర్చయ్యే చోట 1500 నుంచి 2500 వరకు పెట్టాల్సి వస్తోంది. పండగంతా గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది. అక్కడకు స్థానికులే కాదు.. తెలుగు రాష్ట్రాల నుంచి చాలమంది సంక్రాంతికి వెళ్తుంటారు. దీంతో రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500ని మించదు కాని.. ఈసారి స్లీపర్ 4వేల రూపాయలుగా పెట్టేశారు. ఈ దోపిడీ ఏంటని ప్రయాణీకులు తలలు పట్టుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే 2వేలు ఉంది. వైజాగ్‌కు ఆర్టీసీ బస్సులో 2వేల రూపాయల లోపే టికెట్ ఉంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3వేల నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్ అయితే 6వేల వరకు ఉంటున్నాయి.
రైళ్లలో రద్దీ మామూలగా లేదు. రెండు మూడు రాష్ట్రాల్లో పండగ ఉండడంతో రైళ్లు రద్దీగా ఉన్నాయి. అంతేకాదు లేటుగా నడుస్తుండడం కూడా ప్రయాణికులపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నారు చాలా మంది ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి గన్నవరం, రాజమండ్రి, వైజాగ్‌కు వెళ్లేందుకు జనం ఎగబడుతుండడంతో ఇదే అదనుగా.. పలు కంపెనీలు చార్జీలు పెంచేశాయి. రాజమండ్రి వెళ్లాలంటే 12 వేల నుంచి 15వేల వరకు టికెట్ కనిపిస్తోంది. వైజాగ్ టికెట్ కొనాలంటే 15వేలకు తగ్గడంలేదు. దీంతో జనం పండగ చేసుకునేందుకు దాచుకున్న సొమ్మంతా.. నిలువు దోపిడీ చేస్తున్నాయి ట్రావెల్స్ కంపెనీలు. ఇక క్యాబ్‌లో వెళదామన్నా పండగ రష్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇంటికెళ్లే దారేది అన్నట్లు తల పట్టుకుంటున్నాడు సామాన్యుడు.