by Suryaa Desk | Thu, Jan 09, 2025, 04:01 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలతో పాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 78,206.21 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటిక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 78,206.21 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 77,542.92 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది. చివరకు స్వల్పంగా కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 528.28 పాయింట్లు పతనమై.. 77,620.21 వద్ద ముగిసింది.నిఫ్టీ 162.45 పాయింట్లు తగ్గి 23,526.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో దాదాపు 1,175 లాభపడగా.. మరో 2,610 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, బీపీసీఎల్ నష్టపోయాయి. హెచ్‌యూఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఆటో లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా అన్ని సూచీలు.. ఐటీ, మెటల్, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, పవర్, రియాల్టీ ఒకటి నుంచి రెండుశాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం వరకు తగ్గుముఖం పట్టాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.86 వద్ద ఉన్నది.