by Suryaa Desk | Fri, Jan 10, 2025, 07:03 PM
తెలంగాణలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై హైకోర్టులో విచారణ జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రత్యేక ప్రదర్శనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వటంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రకటించిన తర్వాత.. ఇప్పుడు ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వటం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునసమీక్షించాలంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాను హైకోర్టు ఆదేశించింది. భారీ బడ్జెట్‌తో తీసి నిర్మాతలు ప్రేక్షకుల నుంచి డబ్బును వసూలు చేయాలనుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
గొర్ల భరత్ రాజ్ అనే యువకుడు.. జనవరి 10వ తేదీన ఉదయం 4.30 గంటలకు సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ పిటిషన్ మీద జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. సినిమాటోగ్రఫి చట్టాన్ని ఉల్లంఘిస్తూ టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు హోంశాఖ అనుమతి ఇస్తోందంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. 2021లో జారీ అయిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలి.. కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు న్యాయవాది తెలిపారు. పెంచిన టికెట్ ధరలు ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జీపీ కోర్టుకు వివరించారు.
ఈ విచారణ సందర్భంగా.. పుష్ప-2 చిత్రానికి కూడా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని, బెనిఫిట్ షో వల్ల చోటు చేసుకున్న ప్రమాదాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు గుర్తుచేశారు. ఈ ఘటన తర్వాత.. బెనిఫిట్ షోలను అనుమతించేది లేదని ప్రభుత్వం ప్రకటించినా.. స్పెషల్ షోలకు మాత్రం ఉత్తర్వులిస్తున్నారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. స్పెషల్ షోలకు ఉత్తర్వులివ్వటమంటే.. బెనిఫిట్ షోకు అనుమతించటం లాంటిదేనని ధర్మాసం అభిప్రాయపడింది.
అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వచ్చే సరికి ఎంత సమయం అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని.. సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా అంటూ చురకలంటించింది. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని ధర్మాసనం కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
జనవరి 10వ తేదీన మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్పై అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 19 వరకూ మల్టీప్లెక్సుల్లో టికెట్పై అదనంగా రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ అదనంగా రూ. 50 చొప్పున ధరలు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.