by Suryaa Desk | Sat, Jan 11, 2025, 03:39 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపట్ల కక్షపూరితంగా వ్యవహరించబోదని, కానీ ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగేసిన వారిని మాత్రం వదిలేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తే లొట్టపీసు అంటూ కేటీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటన్నారు.బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో మంత్రులు తప్పులు చేసి... ఇప్పుడు తామేదో చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మంత్రులు చెబితే తాము కొన్ని పనులు చేశామని పలువురు అధికారులు ఏసీబీ విచారణలో వెల్లడిస్తున్నారని తెలిపారు. ఫార్ములా ఈ-కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ కేసులో ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ ఎంటర్ అయిందన్నారు.కేటీఆర్‌ను ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ నేతలు అడుగుతున్నారని, మరి ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదో వాళ్లు కూడా చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. రైతు భరోసా విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుందని హామీ ఇచ్చారు. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.