by Suryaa Desk | Sat, Jan 11, 2025, 03:40 PM
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కొత్త ఆసుపత్రికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలను తీసుకోవాలని చెప్పారు.ప్రతిపాదిత స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ ను సీఎంకు అధికారులు వివరించగా... అందులో మార్పులు, చేర్పులను రేవంత్ సూచించారు. 50 ఏళ్ల అవసరాలను అంచనా వేసి ఆసుపత్రిని నిర్మించాలని చెప్పారు. ఆసుపత్రికి నలువైపులా రహదారులు ఉండాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లు ఉండాలని అన్నారు. పార్కింగ్, మార్చురీ, ఇతర సదుపాయాలను అవసరమైనంత మేర కల్పించాలని చెప్పారు.