by Suryaa Desk | Sat, Jan 11, 2025, 07:28 PM
పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో అరాచకాలకు చిరునామాగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని... అక్కడ్నించి ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భువనగిరి కార్యాలయంపై దాడి ఘటన అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యాలయంపై దాడులు చేసిన వారితో పాటు వారి వెనుక ఉన్న నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.