by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:18 PM
సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక పఠనంతో వచ్చే జ్ఞానం శాశ్వతమని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకుని విజ్ఞానవంతులు కావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శశిపాల్ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రంథాలయానికి శనివారం ప్రముఖ కవులు, రచయితలకు సంబంధించిన సుమారు 80 పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా శశిపాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత సెల్ ఫోన్లు, సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారని, అలా కాకుండా పుస్తక పఠనం చదవడం ద్వారా దేశ నాయకుల జీవిత చరిత్రలు, బాల సాహిత్యం, ఆధ్యాత్మికం ,పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక విషయాలతోపాటు మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునన్నారు.
జీవితాన్ని తీర్చిదిద్దేది పుస్తకమేనని, పుస్తకాలు విజ్ఞాన సముపార్జనకు సోపానాలని అన్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకాలు ఒక మార్గమని చెప్పారు. ప్రతిదీ స్వయంగా చూసి తెలుసుకునే సమయం ఉండదని, పుస్తకాలు చదవడం ద్వారా ఆయా అంశాలపై పట్టు సాధించవచ్చునన్నారు. ప్రతి ఒక్కరికి పుస్తక పఠనం అవసరమని, పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని, తాను గ్రంథాలయానికి అందించిన పుస్తకాలను పాఠకులు వినియోగించుకోవాలని సూచించారు.