by Suryaa Desk | Sat, Jan 11, 2025, 07:06 PM
తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తూ.. ముగ్గురు కొడుకులను మంచి చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు కష్టపడి చదివి పోలీసు శాఖలో ఉద్యోగం సంపాధించాడు. ఇక.. అన్నను స్ఫూర్తిగా తీసుకుని రెండో అబ్బాయి కూడా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుని పట్టణం బాట పట్టాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ గదిలో ఉంటూ.. కోచింగ్ తీసుకుంటున్నాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాధించాలన్న కసితో పట్టణానికి వచ్చిన ఆ కుర్రాడు.. ఫ్రెండ్స్ వల్ల పక్కదారి పట్టాడు. రోజూ వాళ్లను చూస్తూ.. తాను కూడా వాళ్లతో కలిసి ఓ తప్పు చేశాడు. ఇంకేముంది.. ఆ తప్పు కాస్త వ్యసనంగా మారి తన మెడకే ఉరితాడై చుట్టుకుంది. చివరికి.. కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన కుమారస్వామికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు పోలీసు శాఖలో ఉద్యోగు చేస్తుండగా.. రెండో కుమారుడు రాజ్ కుమార్ (26) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. హనుమకొండలో స్నేహితులతో కలిసి ఉంటూ కోచింగ్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గదిలో ఖాళీగా ఉన్న సమయంలో తన స్నేహితులు రోజూ.. మొబైల్‌లో ఆన్‌లైన్‌లో పేకాట ఆడటం చూసి.. తాను ఆకర్షితుడయ్యాయి. ఇంకేముంది.. తాను కూడా స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ బెట్టింగులు పెట్టటం ప్రారంభించారు.
చిన్నగా అలవాటైన ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారం వ్యసనంగా మారింది. ఎంతగా అంటే.. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సుమారు రూ.30 లక్షలకు పైగా నష్టపోయేంత. అయితే.. వారం రోజులుగా.. తనకు అర్జె్ంటుగా రూ.4 లక్షలు కావాలని తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. తమ దగ్గర అంతా డబ్బు లేదనిని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. డబ్బు కోసం కొన్నిసార్లు ఆత్మహత్యకు కూడా యత్నించాడు. అయితే.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ.. శనివారం (జనవరి 11న) ఉదయం నిజంగానే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై స్పందించిన రాజ్ కుమార్ తండ్రి కుమార స్వామి.. తన కుమారుడు లాంటి ఎంతో మంది యువకులు ఇటువంటి ఆన్‌లైన్ పేకాట బెట్టింగ్‌కు అలవాటుపడి.. విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను రద్దుచేసి యువతను రక్షించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.