by Suryaa Desk | Sun, Jan 12, 2025, 03:09 PM
మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ వడ్డే ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొన్నారు.వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వడ్డే ఒబన్న జీవిత ప్రస్థానాన్ని సిబ్బంది చదివి వినిపించారు.జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తొలిసారి సవాల్ చేసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి మిత్రుడు, జీవితం లోనూ, పోరాటం లోనూ , మరణం లోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
1807 సంవత్సరం జనవరి 11న వడ్డె ఓబన్న జన్మించారు , చిన్నప్పటి నుంచి నరసింహ రెడ్డి తో స్నేహం మొదలై మరణం వరకు కొనసాగిందని అన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై అధికంగా పనులు విధిస్తే 1845 లో సైరా నరసింహారెడ్డి నాయకత్వంలో ఉద్యమ ప్రారంభమైందని, వడ్డె ఓబన్న ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, బ్రిటిష్ పాలకులతో వీరోచితంగా పోరాడారని అన్నారు. మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి జీవితంలోని ముఖ్యంశాల నుంచి మనం వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం నేర్చుకోవచ్చని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక మంది స్థానిక నాయకుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని,అదే రీతిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వడ్డె ఓబన్న గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డెర సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.