by Suryaa Desk | Sat, Jan 11, 2025, 07:24 PM
ఇద్దరిదీ ఒకే ఊరు. గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. వీళ్ల ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయేసరికి.. అది కాస్త రచ్చబండకెక్కింది. ఇరు కుటుంబాలను పిలిచి ఊరి పెద్దలు పంచాయతీ పెట్టారు. పంచాయతీలోనే.. ఆ కుటుంబాలు ఈ ప్రేమజంట పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక.. తమ కుటుంబాలు తమ ప్రేమను ఎప్పటికీ ఒప్పుకోవని నిర్ణయించుకుని.. కీలక నిర్ణయం తీసుకుంది ఆ ప్రేమజంట.
కట్ చేస్తే.. ఇంట్లో కాలేజికని చెప్పి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని తీసుకుని, ఆ అబ్బాయి సరాసరి హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తమతో పాటు మంగళసూత్రం, పసుపుకుంకుమ కూడా తీసుకెళ్లారు. ఇంకేముంది.. తమ ప్రేమే సాక్ష్యంగా హోటల్ గదిలోనే ఇద్దరూ వారి మనసులో సాక్ష్యంగా పెళ్లి చేసుకున్నారు. రోజంతా గదిలోనే ఆ క్షణాలను ఆనందంగా గడిపారు. ఒక రోజు కోసం తీసుకున్న గది సమయం ముగిసినా ఇంకా ఆ ప్రేమజంట బయటికి రాకపోవటంతో.. హోటల్ సిబ్బంది తలుపులు కొట్టారు. ఎంతపిలిచినా తలుపులు తీయకపోవటంతో.. కిటికిలో నుంచి లోపలికి చూశారు. దీంతో.. ఆ హోటల్ సిబ్బంది గుండెలు జారిపోయినంత పనైంది. ఇద్దరూ ఒకే తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన.. సింగూరు ప్రాజెక్టు దగ్గరున్న హరిత రిసార్ట్ హోటల్‌లో జరిగింది.
సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ మండల్ కేంద్రానికి చెందిన కరిపే ఉదయ్ కుమార్ (26) తన కుటుంబానికి చెందిన మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. మూడు నెలల క్రితమే తన తండ్రి మరణించగా.. ఆ వ్యాపారం తానే చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక.. అదే గ్రామానికి చెందిన మంగలి మౌనిక (19).. నారాయణఖేడ్‌లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీళ్లిద్దరూ గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీళ్ల ప్రేమ విషయం ఇంట్లో తెలియగా.. వారి కుటుంబాలు ప్రేమ వివాహానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. పంచాయతీ పెట్టి ఊరి పెద్దలు చెప్పి చూసినా ఉపయోగం లేకపోయింది.
కాగా.. గురువారం (జనవరి 09న) రోజు ఈ ప్రేమ పక్షులు ఇంటి నుంచి ఎగిరిపోయాయి. కనీసం ఫోన్‌లో కూడా ఎవరికీ అందుబాటులో లేరు. కాలేజీకి అని చెప్పి వెళ్లిన అమ్మాయి.. ఒక రోజు గడిచినా రాలేదు.. అటు చెప్పపెట్టకుండా ఎటో వెళ్లిపోయిన అబ్బాయి కూడా కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. దీంతో.. ఇరు కుటుంబాలు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో వేరు వేరుగా మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చారు.
కట్ చేస్తే.. ఇంటి నుంచి వెళ్లిపోయిన గురువారం సాయంత్రం.. సింగూరు ప్రాజెక్టు దగ్గరలోని హరిత హోటల్లో రూమ్ తీసుకున్నారు. ఉదయమైనా ఈ యువజంట బయటికి రాకపోవటంతో.. రూమ్ సిబ్బంది డోర్ కొట్టారు. ఎలాంటి స్పందన రాకపోవటంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది.. కిటికీ తెరిచి చూస్తే.. ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. ఒక్కసారిగా షాక్ అయిన సిబ్బంది.. వెంటనే మునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటని ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. ఆ వెంటనే రూమ్ బుక్ చేసుకున్న వివరాల ఆధారంగా.. వారి వారి కుటుంబాలకు విషయం తెలియజేశారు. కుటుంబాలు హోటల్‌కు వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే హోటల్ తలుపులు తెరిచారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ తర్వాత కీలక విషయాలు వెల్లడించారు. మౌనిక, ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారని నిర్దారించారు. గదికి వచ్చే సమయంలోనే తమతో పాటు మంగళసూత్రం, పసుపు, కుంకుమ తెచ్చుకున్నారని పోలీసులు గుర్తించారు. హోటల్ గదిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. అయితే.. హోటల్ గదిలో దొరికిన సూసైడ్ నోట్‌లో.. తమ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోని కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి పెట్టటం గమనార్హం. ఈ మేరకు హోటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
అయితే.. ఉదయ్ తండ్రి 3 నెలల క్రితమే ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కాగా ఇప్పుడు ఉదయ్ కూడా ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించటం ఇప్పుడు ఆ కుటంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఉదయ్ తల్లి బైరమ్మ గుండెలు బాదుకుని రోధించింది.