by Suryaa Desk | Sun, Jan 12, 2025, 11:50 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీహార్కు చెందిన సుపారీ కిల్లర్ సుభాష్ శర్మ బెయిల్ కోసం సమర్పించిన మూడు షూరిటీలు ఫేక్ అని పోలీసులు గుర్తించారు.ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్రాజు వెల్లడించారు. సుభాష్ శర్మకు నకిలీ ష్యూరిటీ పత్రా లు కోర్టుకు అందజేసిన కేసులో ఏ1గా ఉన్న వంగాల సైదులుపై గతంలో కేసులున్నాయి. గతంలో నల్లగొండ జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన 21 దొంగతనాల కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 2018లో జరిగిన ప్రణయ్ మర్డర్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంత పరువు పోయిందని భావించిన మారుతీరావు.. సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. అప్పటికే అమృత గర్భవతి కూడా.ఓ ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లి వస్తు్ండగా మాటు వేసిన సుపారీ గ్యాంగ్ ప్రణయ్ ను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపేశారు. అలాంటి దారుణమైన సంఘటన జరిగిన సమయంలో అమృత మానసిక పరిస్థితి చూసిన వారందరి హృదయాలు కకావికలమయ్యాయి. కులాంతర వివాహాన్ని అంగీకరించని తండ్రి మారుతీ రావే .తన భర్త ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత కేసు పెట్టింది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుభాష్, అమృత తండ్రి మారుతిరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 2019లో బెయిల్ పై రిలీజ్ అయ్యాక మారుతీరావు 2020 మార్చి 7వ తేదీన హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.