by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:09 PM
గత పక్షం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఉదయం మహిళలు ఖాళీ బిందెలు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి బైఠాయించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాగునీటికి నానా తంటాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది తలా కొన్ని డబ్బులు పోగేసుకొని బోరుబావిని తవ్వించుకున్నట్లు పేర్కొన్నారు.
పలుసార్లు సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారుల దృష్టి తీసుకపోయినా ఫలితం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. విషయము తెలుసుకున్న జగదేవపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే మిషన్ భగీరథ ఇటిక్యాల గ్రామానికి చేరుకొని నిరసన చేస్తున్న మహిళలకు నచ్చ చెప్పారు. తాగునీటి సమస్య కొంతమేరకు ఉందని వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏఈ హామితో మహిళలు నిరసనను విరమించుకున్నారు.