by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:53 PM
సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు రూ.10 లక్షల రూపాయలతో తలపెట్టిన సిసి రోడ్డు ప్రనులను బుధవారం ప్రజాప్రతినిధులతో,స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అన్ని కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులను అందిస్తామన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఒక్క తెల్ల రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు.
ఈ నెల 26 నుండి రైతు కూలీలకు నెలకు రూ.1 వేయి చొప్పున సంవత్సరానికి 12 వేలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే రైతు భరోసా ఎకరానికి రూ. 12 వేలకు పెంచడం జరిగింది అన్నారు. త్వరలోనే గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. అర్హులైన అందరికీ దశలవారీగా ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తాను ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ గర్రెపల్లి గ్రామం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో నిత్యం ప్రజల కోసం కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఎమ్మెల్యే విజయరమణ రావు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారమే దీనికి అద్దం పడుతుందని చెప్పారు. ప్రభుత్వం పై నిత్యం ఏదో ఒక అంశంను తీసుకొని బురద జల్లుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి బీఆర్ఎస్ అగ్ర నాయకులు పలు కార్యక్రమాల్లో కావాలని రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.కరీంనగర్ లో ఇటీవల జరిగిన సంఘటన లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును చూసి ప్రజలు ఆయన పట్ల, టిఆర్ఎస్ పట్ల అసహ్యం వ్యక్తం చేస్తున్నారని విజయరమణ రావు అన్నారు.
కౌశిక్ రెడ్డి చెబుతున్నట్టు అసలు ప్రజా సమస్యలపై ఆయన ప్రస్తావించలేదని, కేవలం రాజకీయ అంశాలు, వ్యక్తిగత దూషణలు చేశారని ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బండారి రమేష్, నామని రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్, కళ్ళపెల్లి జాని,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, మాజీ వార్డ్ మెంబర్ లు, ముదిరాజ్ సంఘాల నాయకులు, ఎంపీడీవో, పంచాయతీ రాజ్ ఏఈ, పలువురు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.