by Suryaa Desk | Sun, Jan 12, 2025, 06:58 PM
సంక్రాంతి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్ ప్రజలు పల్లెలకు బయలుదేరారు. సొంత వాహనాలు ఉన్న వారు నిన్నటి నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు. మరోవైపు రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల సందడి నెలకొంది. సొంతూళ్లకు వెళ్లే వారితో సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు పల్లెబాట పట్టడంతో ట్రైన్లను పూర్తిగా నిండిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలోనూ రద్దీ నెలకొంది.
అయితే ఇదే అదనుగా రైల్వే స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడేందుకు అంతర్రాష్ట్ర ముఠాలు రంగంలోకి నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఆభరణాలు, డబ్బును ఇంట్లో భద్రపరిస్తే దొంగలు కొట్టేస్తారనే ఉద్దేశంతో సొంతూళ్లకు వెళ్లే మహిళలు చాలా వరకు వెంట తీసుకెళ్తారు. దీంతో దొంగల ముఠాలు ప్రయాణికుల మాదిరిగా ప్లాట్‌ఫాం, బోగీల్లోకి చేరి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ట్రైన్ రాగానే బోగీల్లోకి ఎక్కేందుకు పోటీ పడే సమయంలో చాలా చాకచక్యంగా ప్రయాణికుల మెడలోని గొలుసులు, చేతిలోని సంచులు లాక్కొని మాయమవుతారని పోలీసులు తెలిపారు. హర్యానా, ఇరానీ ముఠాలు దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
పార్దీగ్యాంగ్, దావూద్‌గ్యాంగ్‌లు బోగీల్లో చేరి ప్రయాణికుల ఏమరపాటును అంచనా వేయటంతోపాటు వారు నిద్రమత్తులోకి చేరగానే సొత్తు కొట్టేసి తర్వాతి స్టేషన్‌లో దిగిపోతున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రైన్లలో కిటీకీలు, డోర్ల వద్ద కూర్చుని సెల్‌ఫోన్లు మాట్లాడుతూ ఏమరపాటుగా ఉండే ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకొని స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ చందనదీప్తి రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతా చర్యలపై వరుసగా సమీక్షిస్తున్నారు.
ఎస్పీ చందనదీప్తి ఆదేశాలతో 100 మంది ప్రత్యేక సిబ్బంది, 400 మంది ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఆభరణాలు, నగదుతో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానితులను గుర్తిస్తే వీడియో తీసి వెంటనే 87126 58586కు వాట్సప్‌నకు పంపాలని చెబుతున్నారు. టోల్‌ఫ్రీ నంబరు 139కు ఫోన్ చేస్తే క్షణాల్లో భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంటారని సూచించారు.