by Suryaa Desk | Sun, Jan 12, 2025, 05:53 PM
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తన ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణలో సభలో ఆసక్తికర ప్రసంగం చేశారు. తాను గవర్నర్ గా వ్యవహరించిన కాలంలో 'ఉనిక' పుస్తకం రాశానని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ నుంచి గవర్నర్ వరకు తన ప్రస్థానం ఈ పుస్తకంలో పొందుపరిచానని వివరించారు. పాలక పక్షం, విపక్షం రాజకీయాలకు పోకుండా ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని స్పష్టం చేశారు. నేతల్లో సాంస్కృతిక జాతీయ వాదం ఉండాలని అభిలషించారు. నాడు బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర వేళ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారని, అశ్వమేథ యాగం చేస్తున్నారంటూ అద్వానీని మెచ్చుకున్నారని వివరించారు. ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా కూడా బీసీ వాదాన్ని సమర్థంగా వినిపించారని కొనియాడారు. ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. అధికార, విపక్షాలు జాతీయ ప్రయోజనాల కోసం అయినా కొన్ని సందర్భాల్లో కలిసిపోవాలని సూచించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేటు బిల్లు పెడితే, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆయన మద్దతిచ్చారని, ఆ బిల్లు పాస్ అయిందని విద్యాసాగర్ రావు గుర్తుచేసుకున్నారు.