by Suryaa Desk | Mon, Jan 13, 2025, 01:53 PM
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగన్నాథం అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మందా జగన్నాథం.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 22న ఊపిరితిత్తుల సమస్య రావడంతో కుటుంబసభ్యులు నిమ్స్‌లో చేర్చారు. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో ఆయనను ఆర్‌ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రాగా, వెంటనే అత్యవసర వైద్య చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. రాత్రి 7.40గంటలకు మృతిచెందినట్టు నిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. మందా జగన్నాథం భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి హైదరాబాద్‌లోని చంపాపేట్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.