by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:57 PM
మెట్ పల్లి పట్టణంలో సంక్రాంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పురవీధుల గుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యకర్తలు పత సంచలన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించుకున్నారు. అనంతరం స్థానిక ఎస్సారెస్పీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మూలమైన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని పిల్లలకి నైతిక విలువలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉందని చెప్పారు. అలాగే మన ఆరోగ్యానికి మూలమైన పర్యావరణాన్ని రక్షించాలని, ఒకవేళ రక్షించనీయెడల భవిష్యత్తులో నీరు, స్వచ్ఛమైన గాలి మొదలగు వాటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను పెంచి వనరులను పొదుపుగా వాడాలని తెలిపారు సమాజంలో అందరూ కలిసిమెలిసి కులమత బేధాలు విడిచి తల్లి భరతమాత సంతానంగా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలి అప్పుడే మన పూర్వీకులు చెప్పిన వసుదైక కుటుంబం అనే భావన పూర్తవుతుంది అలాగే మనం స్వదేశీ ఆధారిత జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ఆవశ్యకమైన విషయం.
మనం మన యొక్క భోజనాన్ని అలాగే అవసరమైన వస్తువులను అలాగే ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేసి స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లయితే దేశంలో నిరుద్యోగ సమస్య తొలగిపోయి అందరూ వారి వారి వృత్తుల్లో ఆర్థికంగా బలపడతారని తెలిపారు. పౌరులు రాజ్యాంగ బద్ధులై రాజ్యాంగంలోని మూల విషయాలను పాటించాలని ట్రాఫిక్ నియమాలు పాటించాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని సకాలంలో పన్నులు చెల్లించి ప్రభుత్వాన్ని సహకరించాలని తెలియజేశారు స్వయంసేవకులంతా దేశ హితం కోసం పనిచేయాలని దేశమంటే మన ఇల్లు మన పరిసరాలు మన గ్రామం అని మన చుట్టుపక్కల వారి సాధకబాధకాల్లో పాలుపంచుకోవాలని తెలిపారు. జిల్లా సంఘ చాలక్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, విభాగ్ సహా కార్యవాహ గోనే భూమయ్య, జిల్లా కార్యవాహా గోల్కొండ నాగరాజు,నగర కార్యావాహ మామిడాల శివ కళ్యాణ్, వీర్ల వెంకటేశ్వర్లు తదితరలు పాల్గొన్నారు.