by Suryaa Desk | Sun, Jan 12, 2025, 08:46 PM
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేట చౌరస్తా వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన చాకలి ప్రశాంత్ శామీర్‌పేట సర్కిల్‌లోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. కొంతకాలంగా ఇంట్లోకి డబ్బులు పంపించకుండా పెట్రోల్ బంకులోనే ఉంటూ ఆన్‌లైన్ బెట్టింగులు ఆడుతున్నాడు.బెట్టింగ్‌లో సుమారు రూ.7.50 లక్షలు కోల్పోయాడు. పనిచేస్తున్న బంకులో మరో రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. అన్ని కలిపి రూ.9లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం తెలియక ఆందోళనకు గురై శామీర్‌పేటలోనే రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తండ్రి చాకలి లింగం, భార్య వినోద, ఏడాది కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.