by Suryaa Desk | Mon, Jan 13, 2025, 12:44 PM
భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన స్వామి వివేకానందుడి బాటలో యువత ముందుకు సాగాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని స్వామి వివేకానంద పార్కులో గల వివేకానందుడి విగ్రహానికి చైర్ పర్సన్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ...లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి.. ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం సాహసం నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం.
భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. గొర్రెల గుంపులో పెరిగితే సింహమైనా సరే తన సహజ లక్షణమైన ధీరత్వాన్ని కోల్పోతుంది. పిరికితనంతో బతుకుతుంది. తమ నిజస్వరూపాన్ని మరిచిపోతే యువత కూడా అలాగే భీరువులా బతకాల్సి వస్తుంది అని వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా చైర్ పర్సన్ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, నాయకులు నరోత్తం రెడ్డి, మాధవరెడ్డి, గిరిధర్ రెడ్డి, పాండు, సందీప్, డివైఎస్ఓ హనుమంతరావు, కమిషనర్ జాకీర్ అహ్మద్, కళాశాల ఉపాధ్యాయులు జయదేవ్, శ్రీనివాస్, కిర్రాక్ బాయ్స్ టీమ్ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.