by Suryaa Desk | Tue, Jan 14, 2025, 08:50 PM
కొన్ని ఘటనలు చూస్తుంటే.. ఎదుటివాడు దొంగ అయిన సరే.. దొరికితే దూలతీరిపోయేలా బడితపూజ చేసే సందర్భమైనా సరే.. అరెరే ఎంతపనైపాయే.. అన్న ఫీలింగ్ కలుగుతుంది. అచ్చం అలాంటి ఫీలింగే కలుగుతుంది ఈ దొంగను చూస్తుంటే కూడా. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. కాగా.. అంబర్ పేటలో గత కొంత కాలంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇళ్లల్లో, దుకాణాల్లో దొంగతనం చేయటం అంతా సేఫ్ కాదనుకున్నాడో.. లేదా ఫ్లైఓవర్ సామాన్లు చోరీ చేస్తే అడిగేవాడు ఉండడనుకున్నాడో ఏమో.. ఫ్లైఓవర్ సామాన్లపై కన్నేశాడు.
పండుగ రోజు.. అందులోనూ నగరమంతా పల్లెకు వెళ్లిపోయింది.. ఎవరూ చూడరనుకుని ఫ్లైఓవర్ మీదున్న సామాను చోరీ చేశాడు. ఎవరూ చూడరనుకుని దర్జాగా ఉన్న ఆ దొంగను.. స్థానికులు చూసేశారు. చూసి ఊరికే ఉంటారా..? కేకలు వేశారు. దీంతో.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా తప్పించుకోవాలనేది తోచలేదు. ఫ్లైఓవర్ మీది నుంచి భీమ్ మీదికి ఎలా వచ్చాడో కానీ.. అక్కడి నుంచి కిందికి ఎలా రావాలనేది మాత్రం అర్థకానట్టుంది. ఫ్లైఓవర్ భీమ్ పక్కనే ఓ చెట్టు ఉండగా.. దాన్ని పట్టుకుని కిందికి రావొచ్చనుకున్నాడు. చెట్టు కొమ్మలు పట్టుకుని సేఫ్‌గా ల్యాండ్ అవుతాననుకున్నాడు. కానీ.. ఆ చెట్టు కొమ్మలు అందలేదో.. మరి మనోడు కిక్కులో ఉన్నాడో తెలియదు కానీ.. చెట్టు సాయం లేకుండానే డైరెక్టుగా కింద ల్యాండ్ అయ్యాడు.
దీంతో.. ఆ దొంగకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంలో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దుండగున్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చోరీకి యత్నించిన దుండగుడు.. ఫలక్‌నుమాకు చెందిన రాములుగా పోలీసులు గుర్తించారు. అయితే.. చోరీకి యత్నించిన సమయంలో రాములు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. చోరీకి యత్నించుడేమో కానీ.. చివరికి రాములు నడ్డి విరిగినట్టయింది.
అయితే.. పండుగ వేళ నగరమంతా పల్లె బాట పట్టటంతో.. దొంగలుపడే అవకాశముందని.. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని.. ఊరెళ్లే వారు ముందే పోలీసులకు సమాచారం అందించాలని ముందే తెలిపారు. అయితే.. తాళాలు వేసుకున్న ఇండ్లు, దుకాణాలపై పోలీసుల నిఘా ఉంటుందని కావొచ్చు ఈ దొంగ.. ఫ్లైఓవర్ మీద కన్నేశాడు. వేస్తే వేశాడు కానీ.. ఇలా మధ్యలోనే దూకేసే.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.