by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:34 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిజమైన అర్హులకు వర్తింప చేసే విధంగా అధికారులు పనిచేయాలని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల ప్రత్యేక అధికారులు లింగస్వామి, బాబు నాయక్ లు అన్నారు. బుధవారం దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి సర్వే, గ్రామ సభల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని సర్వేలు గ్రామసభలు నిర్వహించాలని వారు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి తగాదాలకు నిర్లక్ష్యానికి, తావులేకుండా ప్రభుత్వ పథకాలు అమలు అయ్యేటట్లు చూడాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓలు వెంకటలక్ష్మి, బాలయ్య , తహసీల్దార్ లు చంద్రశేఖర రావు, దివ్య , ఎంపీవోలు సయ్యద్ గఫూర్ ఖాద్రి, శ్రీనివాస్ , ఎంఏవో నరేష్, ఎపివోలు రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.