by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:43 PM
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో రూ 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మాజీ జెడ్పిటిసి ప్రభుదాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేస్తుండగా, త్వరలోనే అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతను ఆర్థికంగా ప్రోత్సహిస్తుండగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు నేరుగా కొనుగోలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని తెలిపారు. రూ 2 లక్షల పంట రుణమాఫీని ఏకకాలంలో వర్తింపజేసి రైతులను రుణ విముక్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉండాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ 500 కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ 5 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, నాయకులు గజ్వేల్ ప్రవీణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, మహేందర్ గౌడ్, కిషన్ గౌడ్, గణేష్, ఎల్లారావు, రమేష్ ముదిరాజ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.