by Suryaa Desk | Wed, Jan 15, 2025, 06:49 PM
మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. సబ్ రిజిస్టర్ ఆదేశం మేరకు లంచం తీసుకుంటున్న అటెండర్ (ఔట్ సోర్సింగ్) బానోతు రవి కుమార్ ను డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని, సబ్ రిజిస్ట్రార్ ఆసిపోద్దీన్ ను ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సాయిరాం కాలనీలో ఉన్న 266 గజాల స్థలాన్ని మార్ట్ గేజ్ చేయాలని సుంకే విష్ణు అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించారు.
రూ.10 వేలు ఇస్తే మార్ట్ గేజ్ చేస్తానని సబ్ సబ్ రిజిస్ట్రార్ తెలపడంతో రూ.10లు ఒకేసారి ఇవ్వలేనని, రెండు విడతలలో రూ. 5 వేల చొప్పున ఇస్తానని విష్ణు సబ్ రిజిస్ట్రార్ తో ఒప్పందం చేసుకున్నాడు. సబ్ రిజిస్ట్రార్ లంచం అడిగిన విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు మొదటి విడత రూ.5 వేలను సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్లుగా కార్యాలయంలో పనిచేసే అటెండర్ భానోత్ రవి కుమార్ కి బుధవారం చెల్లించగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.