by Suryaa Desk | Fri, Jan 17, 2025, 02:00 PM
హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.ఈ చోరీపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించనున్నారు. అయితే ఈ సమయంలో పొన్నాల లక్ష్మయ్య ఫ్యామిలీ ఇంట్లో లేదని సమాచారం. ఆయన పండుగకు జనగాంకు వెళ్లారని తెలుసుకుని.. అదే అదనుగా భావించి దొంగలు దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పొన్నాల లక్ష్మయ్య చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే, మంత్రిగానూ పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడిన పొన్నాల.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు.మరో పక్క చేవెళ్లలో నేడు బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో ఈ దీక్షను నిర్వహించనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15 వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. కాగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి BRS రైతు దీక్ష ప్రారంభం కానుంది. ఈ దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరు కానున్నారు. ఇకపోతే జనవరి 16న ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలాభం కోసం రూ.10కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.