by Suryaa Desk | Thu, Jan 16, 2025, 11:37 AM
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు.గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. అటు, ఈడీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫార్ములా ఈ రేస్లో వ్యవహారానికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిదుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఇప్పటికే అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది.హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
కాగా, ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కేసులు ఘనతను తుడిచేయలేవని అన్నారు. 'హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అనేది మంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. ఆనాడు రేసర్లు అంతా హైదరాబాద్ నగరాన్ని కీర్తించారు. హైదరాబాద్ నగర బ్రాండ్ నాకు ముఖ్యం. పారదర్శకంగా రూ.46 కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడిది..? మనీ లాండరింగ్ ఎక్కడిది..?. ఒక్క రూపాయి కూడా వృథా కాలేదు. ప్రతి పైసాకి లెక్క ఉంది. ఫార్ములా ఈ రేస్ రద్దు వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఎలాంటి అవినీతి జరగకున్నా కేసులు, కోర్టులంటూ రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. తప్పు లేకపోయినా ఏదో కాలం వెల్లదీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. త్వరలోనే తప్పకుండా నిజం తెలుస్తుంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.