by Suryaa Desk | Thu, Jan 16, 2025, 07:28 PM
ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే.. తాజాగా ఈడీ అధికారులు తిప్పితిప్పి అడిగారని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దాదాపు 7గంటల పాటు ఈడీ విచారణ అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్‌రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తప్పు చేయలేదు.. చేయబోను. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ తెలిపారు.‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై తప్పుడు కేసులు పెట్టారు. దర్యాప్తు సంస్థలు, విచారణ అధికారులపై ఉన్న గౌరవంతో ఏ తప్పు చేయకపోయినా ఏసీబీ, ఈడీ విచారణకు హాజరయ్యా. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగారు. అన్నింటికీ సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తా.. ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానాలు చెబుతా. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థను గౌరవిస్తా. విచారణకు పూర్తిగా సహకరిస్తా.
నాకు ఒక విషయంలో ఇబ్బందిగా ఉంది. ఇవాళ ఉదయం పేపర్‌లో చూశా. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చువుతుందని తెలిసింది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డికి ఒక మాట చెబుతున్నా. మీపై ఏసీబీ, ఈడీ కేసులున్నాయని.. నాపైనా పెట్టించారు. మీరు దొరికిపోయారు.. నేను నిజాయతీ గల వ్యక్తిని. కేసులన్నింటినీ ఎదుర్కొంటా. విచారణ పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఈ డబ్బుతో ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. న్యాయమూర్తి, మీడియా ముందు లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగానే విచారణ జరగాలి. ఇలా చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ప్రజాధనం కూడా వృథా కాదు. కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. త్వరలోనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు చెప్పలేదు. పిలిస్తే తప్పకుండా హాజరవుతా’’ అని కేటీఆర్ తెలిపారు.