by Suryaa Desk | Sat, Jan 18, 2025, 08:29 PM
సినిమా అవకాశాలు కల్పిస్తానని ఓ మహిళను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఒకరిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ భర్తతో విడిపోయి మణికొండలో హౌస్ కీపింగ్ పని కోసం వచ్చింది. 15 రోజుల క్రితం అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో చేరింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నించేందుకు కృష్ణానగర్ ప్రాంతంలో తెలిసిన వారిని వాకబు చేస్తున్న క్రమంలో డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఆడిషన్స్ ఉన్నాయంటూ కృష్ణానగర్‌లోని ఓ హోటల్‌కు ఆమెను పిలిపించాడు. మొదటి రోజు ఫొటోషూట్ చేసి మరుసటి రోజు రావాలని చెప్పాడు. రెండో రోజు వెళ్లగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.