by Suryaa Desk | Fri, Jan 17, 2025, 07:52 PM
పుష్ప సినిమా చూసి అందులో హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి.. అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అనేలా సినిమాలో ఉన్న కొన్ని సీన్లు చూసి.. ఎలా వస్తాయిరా సామీ ఇలాంటి ఐడియాలు అనుకున్నారు. కానీ.. పుష్ప సినిమా రాకముందు నుంచే అలాంటి చావు తెలివితేటలతో అక్రమ రవాణా జరుగుతోంది. సినిమాలో కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చూపిస్తే.. బయట మాత్రం గంజాయి, డ్రగ్స్, డబ్బులు, బంగారం.. ఇలా ఒకటేమిటీ స్మగ్లింగ్ చేసే అవకాశమున్న ప్రతి ఐటెంను.. ఛాన్స్ ఉన్న ఏ మార్గాన్ని వదలకుండా తరలిస్తున్నారు. పోలీసులు డేగ కన్నేసి పట్టుకుని వెలుగులోకి తీసుకొస్తుంటే.. అమ్మ బాబోయ్.. అని ముక్కున వేలేసుకుంటున్నారు.
కొందరు స్మగ్లర్లు ఎంచుకునే మార్గాలు చూస్తుంటే.. పుష్ప సినిమాలో చూపించిన సీన్లు ఎందుకూ పనికిరావు అన్నట్టుగా ఉంటాయి. అచ్చంగా అలాంటి అక్రమరవాణా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 190 గ్రాముల హెరాయిన్, ద్విచక్రవాహనం, మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.23 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అయితే.. 23 లక్షలంటే కాస్త చిన్న మొత్తమే అయినప్పటికీ.. సరుకును సరఫరా చేస్తున్న విధానం చూస్తే.. "ఎలా వస్తాయిరా సామీ ఇలాంటి ఐడియాలు.. మరీ అందులో పెట్టి ఎలా తరలిస్తున్నార్రా నాయనా.." అని అనకమానరు. నివ్వెరపోయేలా చేసే.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరించారు.
రాజస్థాన్‌కు చెందిన మహేష్, మహిపాల్ అనే ఇద్దరు అంతరాష్ట్ర నిందితులు.. హైదరాబాద్‌లో అధిక ధరలకు హెరాయిన్ విక్రయిస్తున్నారని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. నిందితులిద్దరూ రాజస్థాన్‌కి చెందినవారైనా నేరేడ్‌మెట్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడంలో రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసే వారిగా పనిచేస్తున్నారు. కాగా.. గ్యాస్ రిపేర్‌కి సంబంధించిన పరికరాల్లో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అది కూడా.. ఎవరికీ కొంచెం కూడా అనుమానం రాకుండా.. గ్యాస్ సిలిండర్ వాల్వ్‌లలో ప్యాక్ చేసి విక్రయిస్తుండటం గమనార్హం.
కేవలం ఇదే కాదు.. ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి మార్గాల ద్వారా కూడా మాదకద్రవ్యాలను కస్టమర్లకు చేరవేస్తున్నట్టు సీపీ తెలిపారు. 200 గ్రాముల హెరాయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి... దానిని దాదాపు రూ. 23 నుంచి 25 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన శంషుద్దీన్ అనే డ్రగ్ పెడ్లర్ నుంచి నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు.
2024 నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిదిలో దాదాపు రూ. 88 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్టు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామన్నారు. పిల్లలు, యువత ఇలాంటి మత్తు పదార్థాలకు బలికావద్దంటే.. ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. డ్రగ్స్ గురించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీపీ తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాని సీపీ తెలిపారు. కళాశాలల్లోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు