by Suryaa Desk | Fri, Jan 17, 2025, 07:47 PM
సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కారులో.. అధికారులు కూడా అదే స్పీడుతో.. అంతే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే.. నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 99 మంది పంచాయతీ కార్యదర్శల సర్వీస్ బ్రేక్ చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కలెక్టర్ త్రిపాఠి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నెలల తరబడి విధులకు రాకపోవటం వల్లే కలెక్టర్ త్రిపాఠి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా పరిధిలో పని చేస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులు గత కొన్ని నెలలుగా విధులకు హాజరుకావటం లేదు. ఈ విషయం ప్రస్తుతం కలెక్టర్ త్రిపాఠి దృష్టికి చేరటంతో.. రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మొత్తం 99 మంది పంచాతీయ కార్యదర్శులు గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు విధులకు హాజరు కాలేదని తేలింది. పోటీ పరీక్షల పేరుతో నెలల తరబడి విధులకు హాజరుకావట్లేదని తెలిసింది.
అయితే.. వీళ్లంతా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే విధులకు గైర్హజరైనట్టు తెలియటంతో.. చర్యలకు ఉపక్రమించారు. విధులకు రాని 99 మంత్రి పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. వీళ్లందరినీ ప్రస్తుతం పని చేస్తున్న చోటు కాకుండా.. మరో చోటికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్ ఉత్తర్వులతో ఆయా పంచాయతీ కార్యదర్శులు కంగుతిన్నారు. కలెక్టర్ త్రిపాఠి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. సర్వీస్ బ్రేక్ ఆదేశాలతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఇన్ని రోజుల పాటు సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని.. కానీ కలెక్టర్ త్రిపాఠి మాత్రం కేవలం సర్వీస్ బ్రేక్ చేసి.. తిరిగి వాళ్లందరినీ విధుల్లోకి తీసుకున్నారని అధికారులు చెప్తున్నారు.