by Suryaa Desk | Fri, Jan 17, 2025, 06:58 PM
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాబివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. నాలుగు సంక్షేమ పథకాలను పకడ్బందీగా, పారదర్శకంగా ఈనెల 26 నుండి అమలు చేస్తామన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధి – ప్రణాళిక- కార్యాచరణ సమావేశం జరిగింది.ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… రేషన్ కార్డు లేని పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందిస్తున్నామని, భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలుగా రూ.12 వేలు అందిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయిలో జాబితాలను ప్రదర్శించి, పేదలకు పథకాలు అందిస్తామని, అభివృద్ధిలో రాజకీయాలు ఉండే ప్రసక్తే లేదన్నారు.