by Suryaa Desk | Sat, Jan 18, 2025, 12:18 PM
తెలంగాణలో త్వరలోనే టీడీపీని బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతాం. తెలంగాణలోనూ టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం.’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక్క ప్రభంజనం. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి తన మార్క్ చూపించారు. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. రెండు రూపాయలకే బియ్యం అందించారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారిని మద్రాసీలు అనేవారు.. వాళ్లందరికీ తెలుగు వరమని గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతాం. ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలు ఉన్నారు’ అని చెప్పారు.