by Suryaa Desk | Sat, Jan 18, 2025, 03:10 PM
సింగపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ పర్యావరణ, వాణిజ్య ఇన్‌చార్జ్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌తో సీఎం, తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.పలు రంగాలలో భాగస్వామ్యం కోసం ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం మరియు సాంకేతికత రంగాలలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సక్సస్ చేయడంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్ సానుకూలంగా స్పందించారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్, పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు.
అలాగే.. సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపన అవకాశాలపై మేధోమధన చర్చ నిర్వహించారు. సెమీకండక్టర్ రంగంలో సింగపూర్ సాధించిన అభివృద్ధి, ఉత్తమ పద్ధతులు, నేర్చుకున్న పాఠాలను ఎస్‌ఎస్‌ఐఏ ప్రతినిధులు వివరించారు. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు.
తెలంగాణ ఆహ్వానానికి ఎస్‌ఎస్‌ఐఏ సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌ను సందర్శించి, అవకాశాలను ఎస్‌ఎస్‌ఐఏ బృందం పరిశీలించనుంది. సింగపూర్‌కు చెందిన దిగ్గజ సెమీ కండక్టర్ ఇండస్ట్రీల ప్రతినిధులు, ఎస్‌ఎస్‌ఐఏ చైర్మన్ అప్లైడ్ మెటీరియల్స్, ఇంక్. రీజినల్ ప్రెసిడెంట్ బ్రియాన్ టాన్, ఎస్‌ఎస్‌ఐఏ వైస్ చైర్మన్, గ్లోబల్ ఫౌండ్రీస్ సింగపూర్ సీనియర్ వీపీ టాన్ యూ కాంగ్, ఎస్‌ఎస్‌ఐఏ కార్యదర్శి ఇన్ఫినియన్ టెక్నాలజీస్ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎండీ సీ.ఎస్ చువా హాజరయ్యారు.కాగా.. సింగపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిరోజు పర్యటన కూడా విజయవంతంగా సాగింది. సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం భేటీ అయ్యారు. అదేవిధంగా ఐటీఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కు సహకారం కోసం ఐటీఈతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం.