by Suryaa Desk | Sat, Jan 18, 2025, 07:41 PM
హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏ చిన్న సమాచారం వచ్చిన.. పోలీసులు డేగల్లా వాలిపోయి.. స్మగ్లర్లను పట్టేసుకుంటున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా సరే.. స్మగ్లర్లు మాత్రం పోలీసుల కళ్లుగప్పి.. చాప కింద నీరులా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓయో రూమ్‌లో అమ్మాయితో కలిసి గంజాయి దందా నడిపిస్తున్న నిందితున్ని పోలీసులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.
పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో కొండాపూర్‌లోని ఓయో రూమ్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయితో యువతీ యువకుడు పట్టుబడ్డారు. వీరి నుంచి.. భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన రాజు, మధ్యప్రదేశ్‌కు చెందిన సంజనతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. గత కొంతకాలంగా అరుకు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి.. ఓయో రూమ్‌లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని.. NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాపారం వెనుక ఉన్న ముఠా సభ్యుల వివరాలను వెలికి తీసేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు.. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట్ నల్గొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు.. నిఘా పెట్టి సదరు కారును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 60 కేజీల గంజాయిని పట్టుబడింది. దీంతో.. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ చిన్న సమాచారం తెలిసినా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.