by Suryaa Desk | Mon, Jan 20, 2025, 03:52 PM
ఈ నెల 21న(రేపు) బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాలో రైతు ధర్నా కార్యక్రమం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.ఈ రైతుల ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జిల్లాలో గ్రామసభలు జరుగుతుండటం.. హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ధర్నాకు అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ లో ట్వీట్ చేసిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.తన ట్వీట్‌లో "రేపు నల్లగొండలో BRS పార్టీ నిర్వహించబోయే రైతు ధర్నాకార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య. ఒక పక్క రైతులు రోజుకొకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటే, మీరు పట్టించుకోరు, వారి కుటుంబాలను పరామర్శించరు. కనీసం బాధిత కుటుంబానికి సహాయం చేయాలన్న మనస్తత్వం కూడా రావడం లేదు. మీ సీఎం సింగపూర్ నదిలో బోట్ రైడ్ చేసుకుంట, దావోస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మీ మంత్రులు కబ్జాలు, కమీషన్లలో బిజీగా ఉన్నారు. మరి రైతులు ఏం కావాలి..?" రేవంత్ రెడ్డి.. మరిచిపోకు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి. తెలంగాణ ఉద్యమాన్ని ఓ సారి యాదికి తెచ్చుకో, రాష్ట్ర ప్రజలకు కానీ, రైతులకు కానీ అన్యాయం జరిగితే నిన్ను నిద్ర పోనియ్యం. కందిరీగ లోలె వెంబడిస్తం" అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.