by Suryaa Desk | Sun, Jan 19, 2025, 08:44 PM
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు 100 రోజులు ఎప్పుడో పూర్తయ్యాయని, వీటి అమలుపై రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. "జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, వృద్ధులు, రైతులు, దళితులకు ఇచ్చిన హామీలపై ఏంచేశారు? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి మోసం చేస్తుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజ్యాంగం పేరిట ఆందోళనలు చేపడుతున్నారు. భారత రాజ్యంపై పోరాటం అంటూ రాహుల్ గాంధీ భారత రాజ్యాంగంపై పోరాటం చేస్తున్నారు. మన దేశంలో అంబేద్కర్ ను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే. అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. కానీ, బీజేపీ సర్కారు అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది. కాంగ్రెస్ నేతలకు ఎప్పుడూ గాంధీ కుటుంబ భజన తప్ప మరో నేతను గౌరవించే సంస్కృతి లేదు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం" అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.