by Suryaa Desk | Mon, Jan 20, 2025, 01:10 PM
ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం, మంత్రుల మాటలు నేతి బీరకాయలో నెయ్యిచందంగా మారాయని అనేక సార్లు రుజువయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ సభ్యులకు గత సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని తాజాగా నా దృష్టికి వచ్చింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మహిళా కమిషన్‌కు రూ. 2 కోట్ల 42 లక్షలు కేటాయించినప్పటికీ విడుదల చేసింది రూ. 20 లక్షలకు మించి లేదు. న్యాయమూర్తులతో సమానంగా వ్యవహరించబడే మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు చెల్లించలేక పోతే ఈ ప్రభుత్వం సామాన్య మహిళల హక్కులను ఏ విధంగా కాపాడుతుంది..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.వెంటనే మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఇక నుంచి మొదటి తారీఖునే మహిళా కమిషన్ సభ్యులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నానని హరీశ్‌రావు తెలిపారు.