by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:11 PM
యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్‌ను బొమ్మగా ఉంచి సోనియా గాంధీనే పాలన సాగించారని, తద్వారా రాజ్యాంగానికి తూట్లు పొడిచారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. నెహ్రూ మొదలుకుని ఆ కుటుంబం అంతా రాజ్యాంగాన్ని అవమానించిందన్నారు. ఈరోజు సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు నుంచే నెహ్రూ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు.రెండో తరంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించారని, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి షాబానో కేసునే మార్చాలని పార్లమెంట్‌లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేశారన్నారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ కూటమి అధ్యక్షురాలు సోనియా గాంధీనే పాలన చేశారని, ఇలా పలుమార్లు ఆ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించిందని మండిపడ్డారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నాటి కేబినెట్ చేసిన చట్టాన్ని నేడు రాహుల్ గాంధీ చించివేసి మరోసారి రాజ్యాంగాన్ని అవమానపరిచారని మండిపడ్డారు. ఐదున్నర దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరిచిందన్నారు. అధికారంలో లేనప్పుడు మాత్రమే రాజ్యాంగం, ప్రజలు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ కపట నాటకాలను ప్రజలకు వివరించేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశమంతా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించిందన్నారు.