by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:23 PM
బీఆర్ఎస్ నేతలు ప్రతి జిల్లాకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం రాగానే రైతుల కోసం రూ.61 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు.రైతుల ఆత్మహత్యకు కారణమైన గత ప్రభుత్వ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. రైతులకు డీలర్ల ద్వారా విత్తనాలను అందిస్తున్నామన్నారు. గతంలో ధాన్యం కొనుగోలు సమయంలో నాలుగైదు కేజీలు అధికంగా తూకం వేసేవారని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక అధిక తూకం వేయకుండా చర్యలు చేపట్టామన్నారు.