by Suryaa Desk | Tue, Jan 21, 2025, 06:04 PM
భాజపా ఎంపీ ఈటల రాజేందర్ ఓ స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో మంగళవారం ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేయిచేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ‘‘పేదలు కొనుక్కున్న జాగాలకు భాజపా అండగా ఉంటుంది. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడాను. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారు. కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.