by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:47 PM
హైదరాబాద్ నగరవాసులకు GHMC బంపరాఫర్ ఇవ్వనుంది. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల వసూళ్ల కోసం మరోసారి వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ (OTS) తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు గాను.. ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90 శాతం డిస్కౌంట్‌తో మరోసారి ఓటీఎస్ అమలు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉండగా.. ఆయన రాష్ట్రానికి రాగానే.. ఈ స్కీమ్ అమలకు నివేదికను సమర్పించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. ఫిబ్రవరి నెల నుంచే ఓటీఎస్ అమలుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెుత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.4 వేల వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ. 1000 కోట్లు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే.. రూ.2,500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్ ఇస్తే రూ.1,150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ఆదాయం తగ్గినప్పుడల్లా.. ఈ ఓటీఎస్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. తొలిసారిగా 2020లో ఓటీఎస్‌ను అమలు చేశారు. 2020 ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు ఈ స్కీమ్ అమలు చేశారు. రెండోసారి 2022 జులైలో అమలు చేశారు. ఈ రెండు సార్లు కలిపి బల్దియాకు రూ.700 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. 2024 మార్చిలో మూడోసారి ఓటీఎస్ అమలు చేసి రూ.320 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి నిధుల సమస్య వేధిస్తుండడంతో మరోసారి ఓటీఎస్ తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నారు. ఈ స్కీమ్ కింది ఆస్తి పన్ను బకాయిదారులు కేవలం 10 శాతం వడ్డీతో పెండింగ్ బకాయిలు చెల్లిస్తే సరిపోతుంది. 2024లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టిన వారికి ఓటీఎస్ కింద డిస్కౌంట్ ఇచ్చి కనీసం రూ.500 కోట్లు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.