by Suryaa Desk | Tue, Jan 21, 2025, 07:51 PM
ప్రముఖ ఎఫ్ఎంసీజీ యూనిలీవర్ తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించింది.దావోస్‌లో యునిలీవర్ సీఈవో హెయిన్ షుమాకర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెండు ప్లాంట్ల ఏర్పాటుపై వారి మధ్య చర్చ జరిగింది.మన దేశంలో ఇది హిందుస్థాన్ యూనిలీవర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యునిలీవర్‌కు ఇప్పటి వరకు తెలంగాణలో చెప్పుకోదగిన యూనిట్ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ సందర్భంగా తెలిపింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం యూనిలీవర్ సీఈవో హెయిన్ షుమేకర్, యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్‌లతో భేటీ అయ్యారు.తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై వారి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో యూనిలీవర్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి అందే సహకారం, ఇతర ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. పరిశ్రమల కోసం భూసేకరణ కూడా చేపట్టి ఉంచినట్లు చెప్పారు. దక్షిణాదిన హైదరాబాద్ కీలక ప్రాంతమని, ఇది పలు రాష్ట్రాలకు, నగరాలకు గేట్ వే అన్నారు. తెలంగాణ విజన్ 2050తో ముందుకు సాగుతోందన్నారు.