by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:17 AM
బైకు, సెల్‌ఫోన్‌ల కోసమే తాలెల్మలో కర్రోళ్ల శ్రీనివాస్ (26)ను హత్య చేసినట్లుగా జోగిపేట సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఈనెల 11న తాలెల్మ గట్టు వద్ద జరిగిన యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. సోమవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన ∙విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అందోలు మండలం నాదులాపూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ల శ్రీనివాస్ (26)కు కల్లు, మద్యం సేవించే అలవాటు ఉండడంతో తాలెల్మ, మర్వెళ్లి కల్లు, వైన్స్‌ల వద్దకు తరచూ వెళుతుంటాడు. జోగిపేట రిక్షా కాలనీకి చెందిన సద్దాం హుస్సేన్, అతడి బావమరిది తాడ్‌దాన్‌పల్లి గ్రామానికి చెందిన యూనూస్‌లు ఇటీవల శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నెల 11వ తేదిన ఎప్పటిలాగే మర్వెళ్లి వైన్స్ సమీపంలో కలుసుకున్నారు. అదే రోజున శ్రీనివాస్ తన సెల్‌ఫోన్‌లో లూడో గేమ్ అడుతుండగా సద్దాం గమనించి తాను కూడా ఈ గేమ్‌లో బెట్టింగ్ పెడతానని నీవు గెలిస్తే మందు పార్టీ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ గేమ్‌లో శ్రీనివాస్ గెలవడంతో వారిద్దరికి పార్టీ ఇచ్చేందుకు అంగీకరించి దగ్గరలోని వైన్స్‌లో మద్యం బాటిల్‌ను కొనుగోలు చేసి తాలెల్మ గట్టు ప్రాంతంలోకి వెళ్లి మద్యం సేవించారు. శ్రీనివాస్‌ను మద్యం మత్తులోకి దింపి సద్దాం, యూనస్‌లు మద్యం బాటిల్‌ను పగలగొట్టి శ్రీనివాస్ గొంతు కోసారు. దీంతో ఆతడు కిందపడిపోవడంతో పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి చంపేశారు. అతనికి చెందిన బైకు, సెల్‌ఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి పారిపోయి తాడ్దాన్‌పల్లి చౌరస్తాకు వచ్చి అక్కడి హోటల్ వద్ద కలిసి సద్దాం జోగిపేటకు రాగా, మృతుడి బైకుపై యూనస్ హైద్రాబాద్ వైపు పారిపోయారు. 12వ తేదిన తాలెల్మ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు మాజీ సర్పంచ్ సమాచారం ఇవ్వడంతో తాము సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టామన్నారు. మర్వెళ్లి, తాలెల్మ వైన్స్, కల్లు దుకాణాల వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా సద్దాం, యూనస్, శ్రీనివాస్‌లు కలిసి మద్యం కొనుగోలు చేసిన పుటేజీలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా బైకు, ఫోన్ కోసమే హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారన్నారు. వారిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఏఎస్‌ఐ గౌస్, పోలీసు సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.