by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:02 AM
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. ఇక నీ చరిత్ర సమాప్తం అయింది' అంటూ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, మాట్లాడారు. నియోజకవర్గంలో మీరు కనుమరుగైపోతున్నారనే బాధతో నిన్నటి మండల సమావేశం నిర్వహించారని అన్నారు. మీటింగులు పెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడాలేగానీ, ఇలా వ్యక్తిగత కక్షలు పెంచేలా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఏ కాంగ్రెస్ కార్యకర్త డబ్బులు తీసుకున్నడో నిరూపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామనీ, అది అబద్దమైతే మీరు ముక్కు నేలకు రాస్తారా అని అడిగారు.
అంగారక టౌన్ షిప్ విషయంలో రెండు రోజుల సమావేశం నిర్వహించి, కేవలం ఫంక్షన్ హాలు కిరాయి అని 24లక్షలు వసూలు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కేవలం 50వేలు కిరాయి ఉన్న ఫంక్షన్ హాలుకు 24 లక్షలు ఎందుకు వసూలు చేసి మీరు.. మీ సుడా చైర్మన్ జేబులు నింపుకున్నది వాస్తవమా.. కాదా.. అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మీ పదేళ్ల పాలనలో మీ కార్యకర్తలు ఎన్ని అక్రమాస్తులు కూడా గట్టుకున్నది ప్రజలకు తెలుసునని అన్నారు. కవ్వంపల్లి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నడని ఆరోపించిన మీరు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా గెలవక ముందున్న రసమయి ఆస్తులు.. పదేళ్లలో ఎలా ఇంత పెరిగాయో అందరికీ తెలుసునని అన్నారు.
ప్రజల కష్టసుఖాల్లో మేముంటున్నామనీ, వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే స్పష్టం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎల్ గౌడ్, సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చింతల లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బండారి రమేష్, నాయకులు బుదారపు శ్రీనివాస్, ఆశిక్ పాషా, పోలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.