by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:14 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన అతనికి బ్లడ్ క్లాట్ అయిందని బ్రెయిన్ సర్జరీ చేయాలని వైద్యులు తెలపడంతో భార్య, పిల్లలు తమకున్న అర ఎకర పొలాన్ని అమ్మి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దురదృష్టవశాత్తు మళ్లీ కుడి కాలు, చేతికి పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామానికి చెందిన గొల్లగూడ యాదయ్య(50) తండ్రి హన్మయ్య 2023 మార్చి 19 వ తేదీన హిమాయత్ నగర్ నుండి కమ్మెట గ్రామానికి బైక్ పై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి తనకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తను కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. తనకు బ్రెయిన్ సర్జరీ చేయాలని తెలపడంతో కుటుంబ సభ్యులు ఉన్న ఆస్తిపాస్తులను అమ్మి చికిత్స చేయించారు. దాదాపు నాలుగైదు నెలలు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లోనే ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారు.
అతను మాట్లాడలేడు, తన పనులు తాను చేసుకోలేడు. ఇలా కుటుంబ సభ్యులు గత రెండు సంవత్సరాలుగా తనకు వైద్యం చేయిస్తూ, అన్ని పనులు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. కుటుంబమే గడవడమే కష్టంగా మారి ఏదైనా పని చేసుకుందామనుకుంటే గతంలోనే తన భార్య అనారోగ్యం పాలు కావడంతో నాలుగు ఆపరేషన్లు అయినందున ఆమెకు కూడా ఆరోగ్యం సహకరించడం లేదు. భర్త మంచానికే పరిమితం కావడంతో కుటుంబ భారం ఇబ్బందిగా మారి తన పిల్లల చదువు ఆగమ్యగోచరంగా మారింది. యాదయ్య వైద్యం కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మిన తాను పూర్తిగా కోలుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని, ఆర్థిక సహాయం అందించి తన భర్త ప్రాణాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు అకౌంట్ నంబర్ 141512010001553, ఫోన్ నంబర్ 9390562808 కు ఫోన్ పే, గోగుల్ పే గాని తమకు దోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేయాలని వేడుకుంటున్నారు.