by Suryaa Desk | Tue, Jan 21, 2025, 09:55 PM
ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని టీపీయుఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు గణపురం సురధీర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని తపస్ యూనియన్ ఉపాధ్యాయ బృందం సమక్షంలో సోమవారం మండల వనరుల కేంద్రం ఆవరణలో మండల విద్యాధికారి పురన్ దాస్ చేత ఆవిష్కరింపజేశారు. అనంతరం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల, మండలంలోని మల్కాపూర్, ఊరెళ్ళ, దేవుని ఎర్రవల్లి, అంతారం, చన్వెల్లి తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాలెండర్ లను వితరణ చేశారు.
ఈ సందర్భంగా సురధీర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్ల నుంచి ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బకాయిలుగా ఉన్న పెండింగ్ బిల్లులను, బకాయి ఉన్న 5 డీఏలను వెంటనే మంజూరు చేయాలన్నారు. హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, అలాగే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి వారికి పే స్కేల్ వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ డివిజన్ అధ్యక్షులు మోర లక్ష్మణ్, మండల అధ్యక్షలు రాజశేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, మండల గౌరవాధ్యక్షులు రమణా రెడ్డి, హరిశంకర్, శ్రీకాంత్, రమణరావు తదితరులు పాల్గొన్నారు.