by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:01 PM
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో మరియు పెద్దపల్లి పట్టణంలోని 10, 22, 34 వార్డుల్లో బుధవారం సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక సభల్లో ముఖ్య అతిథిగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన జనవరి 26 నుండి అమలు చేసే రైతుభరోసా,కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు నాలుగు సంక్షేమ పధకాలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 80 శాతం మంది ప్రజలకు కల్పిస్తున్నామని అన్నారు. బీ.ఆర్.ఎస్ పది సంవత్సరాల పాలనలో ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రేషన్ కార్డులు రాక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి రేషన్ కార్డులు ఇచ్చారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి స్థలం ఉంటే రూ. 5 లక్షలు ఇందిరమ్మ ఇండ్ల కోసం మంజూరు చేస్తామని అన్నారు. నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి 3500 ఇండ్లు మంజూరు కావడం జరుగుతుందని, నాలుగు సంవత్సరాలుగా దశలవారీగా ఇండ్లు లేని వారందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎంపిక చేయడం జరిగిందన్నారు. భూమిలేని నిరుపేదలందరూ ఉపాధి హామీలో సంవత్సరానికి 20 రోజుల పని దినాలు చేసి ఉంటే వారికి ప్రభుత్వం ఆరు నెలకు రూ. 6000 చొప్పున ఏడాదికి రూ. 12000 ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని, ఈ అప్పు భారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మీద ఎలాంటి పన్ను వేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడని కొనియాడారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో, రైతు భరోసా లాంటి పథకాలను అమలు పరుస్తూ ఉంటే కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారని వాళ్ల హయంలో ఎంత మంది ప్రజలకు లబ్ధి చేకూర్చారని, ఎంత మంది ప్రజలకు రేషన్ కార్డులు అందించారని విమర్శించారు. పలు రకాలుగా పెద్దపల్లి ని దోచుకున్న కొంతమంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తుంటే నవ్వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్ కమీషనర్ వెంకటేష్,ఎంపీడీఓ శ్రీనివాస్, తహసిల్దార్ రాజ్ కుమార్,మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పెద్దపల్లి విండో ఛైర్మన్ నర్సింహ రెడ్డి, కౌన్సిలరులు నూగిల్ల మల్లయ్య, ఉప్పు స్వరూప రాజు, నూర్జహాన్, భూతగడ్డ సంపత్,అమరేష్, శ్రీమాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.