by Suryaa Desk | Thu, Jan 23, 2025, 03:59 PM
గ్రామ సభలో ప్రదర్శిస్తున్న జాబితాలు పరిశీలించి అభ్యంతరాలుంటే అధికారులకు చెప్పాలని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ అన్నారు. బుధవారం మండలంలోని అంతారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తహశీల్దార్ కృష్ణయ్యతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులై ఉండి జాబితాలో లేకుండా ఉంటే గ్రామసభల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందుతాయన్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా కింద రూ.12వేలు, భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12వేలు వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. ప్రతి పథకంలో అర్హులకు చోటు దక్కుతుందన్నారు. ఈ గ్రామసభలో ఏఈఓ రమ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ కమిటీపై రసాభాస
అధికారులు ఇందిరమ్మ ఇళ్ళ జాబితాను ప్రదర్శిస్తున్న సందర్భంలో ఇందిరమ్మ కమిటీలో పేర్లను చదివి వినిపించాలని గ్రామస్తులు అన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ ఇందిరమ్మ కమిటీ పేర్లు తెలపగా, అసలు ఇందిరమ్మ కమిటీ ఎవరి సమక్షంలో వేశారని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరెందర్ రెడ్డి పనేనని గ్రామస్థుడు అనడం గమనార్హం. ఇందిరమ్మ కమిటీ గ్రామ ప్రజల సమక్షంలో, గ్రామసభలో వేయలేదని అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ కమిటీ ఫైనల్ కాదని అధికారులు గ్రామస్తులను సముదాయించి చెప్పారు. గ్రామ కార్యదర్శి, ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సభ పెట్టుకొని మళ్లీ ఇందిరమ్మ కమిటీ వేసుకొండని ఆర్డీవో సూచించారు.